న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టిగా సమర్థించింది. ఇది మహిళల పట్ల చూపుతున్న వివక్ష కాదని, శతాబ్దాలుగా వస్తున్న మతపరమైన ఆచారాలను గౌరవించడమేనని సుప్రీంకోర్టుకు విన్నవించింది. మన దేశంలో కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన, పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
శబరిమల కేసుపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం మూడో రోజు విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. భక్తి అనేది స్త్రీ, పురుషాధిక్యతలకు సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు.పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు: దేవి భగవతి వంటి ఆలయాల్లో పురుషుల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయని, ఇది కూడా ఆచారంలో భాగమేనని తెలిపారు.
మహిళల వేషధారణలో పురుషులు: కేరళలోని మరో ఆలయంలో పురుషులు మహిళల వేషధారణలో వెళ్లే ఆచారాన్ని ప్రస్తావిస్తూ.. మతపరమైన విశ్వాసాలను రాజ్యాంగపరమైన వివక్షతో ముడిపెట్టలేమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.2018లో శబరిమలలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తీర్పుపై పెద్ద ఎత్తున రివ్యూ పిటిషన్లు దాఖలవ్వడంతో, 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగొయ్ ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
ప్రస్తుతం ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో లోతైన విచారణ జరుగుతోంది. ఏది మూఢనమ్మకమో, ఏది ఆచారమో తేల్చగలమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది
