
టన్నెల్‌లో 8 మంది చిక్కుకుని ఐదు రోజులు అయ్యింది.. వారి జాడ ఇంత వరకు తెలియదు. మరోవైపు.. టన్నెల్‌లో ప్రమాదం జరిగిన స్పాట్‌కు చేరుకునేందుకు సహాయక బృందాలు తిప్పలు పడుతున్నాయి. అతికష్టం మీద.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 15 మీటర్ల దూరం వరకు చేరాయి NDRF, ఆర్మీ టీమ్స్. అక్కడ… నీరు, బురద పేరుకుపోయి ఉంది. వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 15 అడుగుల లోతులో… 150 మీటర్ల మేర బురద పేరుకుపోయినట్టు చెప్తున్నారు. బురద, నీటిని తొలగించే పనులను ముమ్మరం చేశారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) ముక్కలై… దాని ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందిగా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను… గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తామని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. ఇక.. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే బురదను తొలగించే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
ఓవైపు బురద, ఇంకో వైపు సీ ఫేస్ వాటర్, మరోవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM)ముక్కలతో సహాయక చర్యలకు అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినా… సహాయక బృందాలు మాత్రం.. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు… రిస్క్ చేస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 సంస్థలు పాల్గొంటున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF),ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF), జ్యువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎల్ అండ్ టీ, సింగరేణి, హైడ్రా టన్నెల్ నిపుణులతో పాటు మరికొన్ని సంస్థలు… రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాలు పంచుకుంటున్నాయి. సహాయక చర్యలు పూర్తవడానికి మరికొన్ని రోజులు పడుతుందని మంత్రులు చెప్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు.
రేపు టన్నెల్ దగ్గరకు బీఆర్‌ఎస్ బృందం
రేపు టన్నెల్ దగ్గరకు బీఆర్‌ఎస్ బృందం వెళ్తోంది. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే ఇప్పటి వరకు తాము అక్కడికి వెళ్లలేదని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేపు వెళ్లి.. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే… ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా టన్నెల్ దగ్గరకు రాకపోవడాన్ని తప్పుబడుతోంది బీఆర్‌ఎస్. ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలే ముఖ్యమని విమర్శిస్తోంది.