
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి : దిశ సంఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది..నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కండపేట లో మార్చి 29 వ తేదీ శనివారం దైవ దర్శనానికి వచ్చిన మహిళ పై సామూహిక అత్యాచారం ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కల్వకుర్తి డిఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని, కల్వకుర్తి డివిజన్ పరిధికి చెందిన పోలీసులు మొత్తం కేసు విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో బాధితురాలు సోమవారం ఉదయం ఊర్కొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు..వెంటనే కల్వకుర్తి సీఐ నాగార్జున, ఊర్కొండ ఎస్సై కృష్ణ దేవరాయ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా సీనియర్ అధికారీ కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. కేసు దర్యాప్తు ప్రారంభం కాగానే విచారణ చేపట్టి కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సీసీ కెమెరాల పుటేజ్ ద్వారా, ఫోన్ల ద్వారా గ్యాంగ్ రేప్ లో ఉన్న ఏడు మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.
ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం, మంగళవారం రోజు భజనలతో కూడిన పూజలు జరుగుతాయని, చాలా మంది భక్తులు అక్కడే పడుకుంటారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన బాధితురాలు వాళ్ల బంధువుతో కలిసి శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో దేవాలయానికి వచ్చిందన్నారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆలయ సమీపంలో ఆమె బంధువును కట్టేసి మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం అనంతరం విషయం బయటికి చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్లు తెలిపారు. బాధితురాలు ఆలయ ప్రాంగణంలో రాత్రి 2, 3 గంటల సమయం వరకు ఉండి, ఊరికి వెళ్లి పోయిన తర్వాత సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అందుకే మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ గారు ఈ కేసు విషయంలో విచారణ జరపాలని సంఘటన స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. గ్యాంగ్ రేప్ కేసులో ఉన్న ఏడుగురు నిందితులు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు వరకు ఉన్నారని, వారిపై క్రైమ్ నెం:34/2025 70 (1 గ్యాంగ్ రేప్), 351, 310 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వారిలో మారుపాకుల ఆంజనేయులు, సాధిక్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్,.మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులు ఉన్నారని చెప్పారు. తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ కేసు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ కేసు విషయంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ లు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సైలు కృష్ణ దేవరాయ, మాధవ రెడ్డి, కురుమూర్తి సబ్ డివిజన్ పోలీసులు కేసు విచారణ విజయవంతంగా పూర్తి చేసి, ఏడుగురు నిందితులను జైలుకు పంపే విధంగా పని చేసిన వారికి జిల్లా పోలీస్ శాఖ తరుపున అభినందనలు తెలుపుతున్నట్లు ఎస్పీ చెప్పారు. వీరితో పాటు మరి కొన్ని ముఠాలు ఉన్నాయని, వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అని ఎస్పీ వెల్లడించారు.