జాతీయం

Cancer Tests: మరింత చౌకగా పరీక్షలు.. వైద్య రంగంలోకి రిలయన్స్‌ ఎంట్రీ!

రిలయన్స్‌ సంస్థ వైద్యరంగంలోకి అడుగు పెట్టబోతోంది. అతి తక్కువ ధరకే మెడికల్ టెస్టులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Reliance Genomic Tests: రిలయన్స్‌ సంస్థ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. తక్కువ ధరలకే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ ఫీల్డ్ లోకి రాబోతోంది.  ఏకంగా రూ. 10 వేల విలువైన వైద్య పరీక్షలను కేవలం రూ. 1000కే  ఇవ్వాలని భావిస్తోంది. లుగేళ్ల కిందట రూ.393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరు సంస్థ స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ద్వారా ఈ డయాగ్నస్టిక్‌ పరీక్షల రంగంలోకి ప్రవేశించాలని రిలయన్స్‌ నిర్ణయించింది.

వైద్య పరీక్షలకు జినోమిక్‌ సైన్స్‌ వినియోగం

ఈ సంస్థ వైద్య పరీక్షలకు జినోమిక్‌ సైన్స్‌ ను ఉపయోగిస్తోంది. ఇందులో రక్తం, లాలాజలం, దేహంలో ఏదో ఒకదాని నుంచి తీసిన టిష్యూను శాంపిల్‌ గా వినియోగిస్తారు. ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్న వైద్య పరీక్షల ప్రక్రియ. రాబోయే వ్యాధులను ముందే గుర్తించడానికి జినోమిక్‌ సైన్స్‌ ను వాడుతున్నారు. క్యాన్సర్‌ వచ్చిన వాళ్లకు అది ఏ స్థాయి వరకు దారి తీయొచ్చో కూడా చెప్పే విధంగా ఈ సైన్స్‌ అభివృద్ధి చెందుతోంది. జినోమిక్‌ సైన్స్‌ ద్వారా వ్యక్తులకు తగ్గట్లు చికిత్స ప్రణాళికలను రూపొందించవచ్చు. వ్యక్తి జన్యువులు, క్రోమోజోముల ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలను రూపొందించవచ్చు.

చౌక ధరలకే వైద్య పరీక్షలు

చౌక పరీక్షల ద్వారా సమాజం మీద తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నామని రిలయన్స్‌ సీనియర్‌ అధికారి, స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ డైరెక్టర్‌ నీలేశ్‌ మోడీ అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ధరలు అందుబాటు లో ఉండాలన్న అంశంపై ముఖేశ్‌ అంబానీ పట్టుదలగా ఉన్నారని, అందుకే ప్రాజెక్టు ఆవిష్కరణకు టైమ్‌లైన్‌ పెట్టుకోలేదని వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరీక్ష విలువ రూ.10 వేలు ఉందని, దాన్ని వెయ్యి రూపాయలకు తీసుకొస్తామని స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. జెనెటిక్‌ సీక్వెన్సింగ్‌, క్యాన్సర్‌ను ముందే గుర్తించే పరీక్షలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ ఏడాది రిలయన్స్‌ వార్షిక సమావేశంలో ముఖేశ్‌ అంబానీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జినోమిక్స్‌ విప్లవంతో రోగాలను నయంచేసే విధానంలో అనూహ్య మార్పులొస్తాయని, మానవుడి ఆయుర్ధాయం పెరుగుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button