తెలంగాణరాజకీయం

రేవంత్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి మధ్య సయోధ్య - వాళ్లంతా కలిసిపోయినట్టేనా..!

సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించినట్టే ఉన్నారు. మంత్రులు, పార్టీ నేతలతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా… ఒక అడుగు తగ్గయినా అందరినీ కలుపుకుపోతానని చెప్పారాయన. ఇప్పుడు అదే జరిగినట్టు ఉంది. ఉప్పు-నిప్పులా ఉండే రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డిపై కారాలు మిరియాలు నూరిన కోమటిరెడ్డి, ఉత్తమ్‌… ఇప్పుడు చల్లబడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వాళ్లలో మార్పు… కొంచెం కొంచెంగా కనిపిస్తోంది. అదంతా ఎలా సాధ్యమైంది అంటే.. కాంగ్రెస్‌ పార్టీలో ఏదైనా సాధ్యమే అన్న నానుడి వినిపిస్తోంది. పార్టీలో నేతలు ఇప్పుడు కొట్టుకుంటారు… రేపు కలిసిపోతారు. హస్తం పార్టీలో ఉన్న స్పెషాలిటీ అదే. ఉప్పు, నిప్పులా ఉన్న రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి మధ్య కూడా ఈ ఫార్ములా వర్కౌట్‌ అయినట్టు ఉంది.

ఎన్నికలకు ముందు… కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. అయితే… పార్టీలో సీనియర్‌ నేతలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అది నచ్చలేదు. దీంతో… రేవంత్‌రెడ్డిపై అక్కసు వెళ్లగక్కారు. పీసీసీ చీఫ్‌ పదవిని కొనుకున్నారని కూడా ఆరోపించారు కోమటిరెడ్డి. అంతేకాదు.. అప్పట్లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు ప్లాన్‌ చేస్తే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తమ జిల్లాల్లో తామే చేస్తామని.. పీసీసీతో పనిలేదని గట్టి కామెంట్లు చేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డిని నియమించడం కూడా వారికి అంతగా నచ్చలేదనే చెప్పాలి. అయితే… ఇప్పుడిప్పుడే అంతా సెట్‌ అవుతున్నట్టు కనిపిస్తోంది.

Also Read : 16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం

పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని తన నియోజకవర్గంలోకి రావొద్దన్న మంత్రి కోమటిరెడ్డి… ఇప్పుడు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. సొంతూరు బ్రహ్మణవెల్లంలో రిజర్వాయర్‌ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలోనూ నల్లగొండలో సభ పెట్టించారు. ఇక.. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా నెమ్మదిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఉగాది సందర్భంగా… రేషన్‌ లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్‌ నుంచే ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అంతేనా… మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి కూడా రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. అంటే… విభేదాలు పక్కన పెట్టి కలిసి నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సయోధ్య చూసి… తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు తెగ సంతోషపడిపోతున్నారు. ఇక అన్నీ మంచి రోజులే అని సంబరపడిపోతున్నారు. ఈ సయోధ్య.. చివరి వరకు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి .. 

  1. టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం..!

  2. వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

  3. ఆ మంత్రి పదవి కోసం నలుగురు పోటీ – రాజగోపాల్‌రెడ్డి ఆశ నెరవేరానా?

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button