
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో భారీ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44లో ఉన్న సుమారు 43 ఎకరాల విలువైన భూమిని కాజేసేందుకు ఓ ముఠా పక్కా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారుల విచారణలో ఈ భూములను అక్రమంగా తమ పేరిట మార్చుకునేందుకు 58 ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ జరిగినట్లు చూపించే నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తేలింది. పాత రికార్డులు, ఫోర్జ్డ్ సర్టిఫికెట్లు, తప్పుడు సంతకాలు ఉపయోగించి భూములపై హక్కులు ఉన్నట్లు చూపే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read More : కన్న కూతురిని వ్యభిచారంలోకి దింపిన తండ్రి, రుతుస్రావంలోనూ..
ఈ వ్యవహారంలో భూ రికార్డుల మార్పులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని స్పష్టం చేశారు. ఈ భూ కబ్జా ప్రయత్నంలో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చెందిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 పాత్ర ఉన్నట్లు రుజువుకావడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు సదరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2ను తక్షణమే సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఐజీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై తీవ్ర చర్చ మొదలైంది. భూ లావాదేవీల్లో నకిలీ డాక్యుమెంట్లను అడ్డుకునేందుకు మరింత కఠినమైన పర్యవేక్షణ అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ భూ కబ్జా కేసుపై లోతైన విచారణ కొనసాగుతుండగా, ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర అధికారుల పాత్రపై కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.





