
నల్గొండ నిఘా ప్రతినిధి – క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాజకీయ వేదికపై ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలిచే పేరు — కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ‘రెబల్ పాలిటిక్స్’కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన ఆయన, మరోసారి తన ప్రత్యేక రాజకీయ శైలి, వ్యూహాలతో రాజకీయ కక్ష్యలను వేడెక్కిస్తున్నారు.
సమీప కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌తో జరిగిన గోప్య భేటీ, రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీ వెనుక నిజమైన అర్థం ఏమిటి? కేవలం పాత స్నేహం గుర్తు చేసుకున్నదేనా? లేక రాబోయే ఎన్నికల దిశగా ఏదైనా వ్యూహరచనా? రాజకీయ పరిశీలకుల ప్రకారం, రాజగోపాల్–శివకుమార్ సమావేశం కాంగ్రెస్‌లో తన స్థానాన్ని బలపరచుకునే ప్రయత్నమే కావచ్చని అంచనాలు ఉన్నాయి. తాను పార్టీకి అంకితభావంతో పనిచేయడానికి సిద్ధమని పలుమార్లు ప్రకటించినా, కాంగ్రెస్ శ్రేణుల నుంచి తగిన స్థాయి స్పందన రాకపోవడం వెనుక అంతర్గత గణాంకాలు ఉన్నాయని భావిస్తున్నారు. పార్టీ లోపలి సమీకరణలు, పాత విభేదాలు, అలాగే నాయకత్వం కొత్త సమతుల్యాన్ని సాధించాలనే ఆలోచన ఈ స్తబ్దతకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
కాంగ్రెస్‌లో గ్యాప్ సృష్టమైన ఈ తరుణాన్ని, ఇతర పార్టీలు అవకాశంగా మలచుకోవాలనుకుంటున్నాయి.
తెలంగాణలో ఒక జాతీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ నుంచి కూడా ఆయనపై గట్టి ఫాలోఅప్ జరుగుతోందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
రాజకీయ రంగంలో ఆయన వ్యక్తిత్వం, వాక్చాతుర్యం, ఆర్థిక శక్తి — ఇవన్నీ ఏ పార్టీకి అయినా ఉపయోగపడతాయని అగ్రనాయకుల లెక్కలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ త్రివేణిలో తన భవిష్యత్ ప్రయాణాన్ని కొనసాగిస్తారో సమయమే చెబుతుంది. అయితే ఆయన గత రాజకీయ చరిత్ర, తాను తీసుకున్న అప్రకటిత నిర్ణయాలు చూస్తే — రాబోయే రోజుల్లో మరో ‘పాలిటికల్ ట్విస్ట్’ తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.