
Rains In Telangana And AP: రుతుపవనాలు యాక్టివ్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నాడు హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ భారీ వర్షాలు
అటు ఏపీలోనూ భారీ వర్షాలు కుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు. బీహార్ నుంచి జార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు మరో ద్రోణి కొనసాగుతోందన్నారు. వీటి భావంతో శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయన్న అధికారులు.. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 23 వరకూ రాష్ట్రంలో వర్షాలు పడుతాయన్నారు. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నెల 24న ఉత్తర ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 48 గంటల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
ఇవాళ అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read Also: ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు!