
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): “అందరికి ముందే తెలిసాక ఆకస్మికం ఎలా అవుతుంది..?” అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని చూస్తే, డిఎంహెచ్వో తనిఖీలు కేవలం ఒక నాటకమని వారి అభిప్రాయం. నల్లగొండ జిల్లా డిఎంహెచ్వో మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న కంటి పరీక్ష శిబిరాన్ని పరిశీలించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఎన్నడూ కనబడని సిబ్బంది సైతం ఆసుపత్రిలో కనిపించారు. ఫలితంగా ఆసుపత్రి ఒక్కసారిగా కళకళలాడింది.
రోగులకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రి, ఆ రోజు మాత్రం సిబ్బందితోనే నిండిపోయింది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు, ముందే సమాచారం లభించడంతో “ఆకస్మిక తనిఖీ” అసలు ఉద్దేశాన్ని కోల్పోయిందని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఆసుపత్రి చుట్టుపక్కల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. చెత్త, మురుగు నీరు, దోమల బెడద రోగులను కుంగదీస్తున్నాయి. ప్రజలకు ఆరోగ్యం గురించి బోధించే వైద్యులు, ఆసుపత్రి పరిశుభ్రతపై మాత్రం చిన్న చూపు చూస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే పరుగులు తీసే సిబ్బంది, ప్రతిరోజూ ఇలా పనిచేస్తే బాగుండును. రోగుల సమస్యలు తగ్గుతాయి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.