తెలంగాణ

కమ్యూనిటీ భవన పనుల్లో నాణ్యత లోపాలు.. గ్రామస్తుల ఆవేదన

కల్వకుర్తి, క్రైమ్ మిర్రర్:- జీడిపల్లి గ్రామ కమ్యూనిటీ భవన పనులు నత్తనడకన సాగుతుండటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వంలో జీడిపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయబడింది. అప్పట్లో కాంట్రాక్టర్ భవనం నిర్మాణాన్ని ప్రారంభించి, స్లాబ్ వరకు పనులు చేపట్టాడు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం పంచాయతీ భవన నమూనాను మార్చడంతో, కొత్త పంచాయతీ భవనాన్ని హనుమాన్ దేవాలయం పక్కన నిర్మించారు. దీంతో పాత భవనం సగం నిర్మాణంలోనే ఆగిపోయింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ నిర్మాణాన్ని గ్రామ కమ్యూనిటీ భవనంగా తీర్మానించి కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పటి నుంచి నేటివరకు భవన పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. బిల్లులు విడుదల కాలేదనే కారణంతో కాంట్రాక్టర్ పనులు సరిగా కొనసాగించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పైగా, జరుగుతున్న పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం గమనార్హమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోడలకు నీరు పోయకపోవడం వల్ల క్యూరింగ్ సరిగా జరగకపోవడం, భవిష్యత్తులో గోడలు పగిలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న భవనంలో నాణ్యత లేకపోవడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా పనులు పూర్తి చేయకపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం దారుణం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని గ్రామస్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Read also : డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష తప్పదు

Read also : గొర్రెల, మేకల పెంపకం దారుల సమస్యలపై ఆర్డీవోకి వినతి

Read also : నందిపాడు గ్రామ.. శతాధిక వృద్ధుడు మృతి!

Back to top button