తెలంగాణ

సీఎంవోలో ప్రక్షాళన- సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌ ఇదే…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటింది. అయినా… ఇప్పటి వరకు పట్టుసాధించలేకపోయారు. అధికారుల సహకారం కూడా ఆయనకు అంతంత మాత్రమనే చెప్పాలి. అధికారులపై ఫోకస్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి… తనకు అనుకూలంగా ఉండేలా కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. సీఎంవోలో ప్రక్షాళన మొదలుపెట్టారు. కొందరు అధికారులను బదిలీ చేసి… కొత్తవారికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ పాలన సాగింది. 18 నెలల క్రితం అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి.. పాలనపై పట్టుసాధించేందుకు కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా అధికారుల నుంచి సరైన సహకారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు రేవంత్‌రెడ్డి. అయితే.. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిదాటుతుందన్న ఆలోచన.. సీఎంవో ప్రక్షాళనకు పూనుకున్నారు. గత 27న 18 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం కార్యదర్శిగా ఉన్న షానవాజ్‌ ఖాసిమ్‌ను… డ్రగ్‌ కంట్రోలర్‌ అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ చేశారు. టీటీడీ జేఈవోగా పనిచేసిన కేఎస్‌ శ్రీనివాసరాజును సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే… సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోగా నియమించారు. ఇక… పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్‌ రంజన్‌ను సీఎంవోలోకి తీసుకొచ్చారు. ఆయనకు ఇండస్ట్రీ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌తోపాటు స్పీడ్‌ డెలివరీ విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సీఎంవోలోని మరికొందరు అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. సీఎం కార్యదర్శిగా ఉన్న IFS అధికారి చంద్రశేఖర్‌రెడ్డి.. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమించబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

సీఎంవోలోని కొందరు అధికారులను మాత్రం వారివారి స్థానాల్లోనే ఉంచారు. వీరిలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, OSD వేముల శ్రీనివాసులు ఉన్నారు. వీరంతా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌గా ఉండనున్నారు. సీఎంవోలో అధికారుల మార్పులు-చేర్పులతో సమర్థవంతమైన పాలన, పనితీరు ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నట్టు సమాచారం.

పవన్‌ దగ్గుతున్నాడని విక్స్‌ చాక్లెట్‌ ఇచ్చిన మోడీ – అభిమానమా…! వ్యూహమా…!

నీట్‌’ పరీక్షకు భద్రత ఏర్పాట్లు… పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ గారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button