
Psychology facts: అబద్ధం చెప్పడం ఒక కళలా అనిపించినా.. దాన్ని అందరూ అలవోకగా చేయలేరని పెద్దలు చెప్తుంటారు. కొందరైతే పరిస్థితిని బట్టి అబద్ధం చెప్తే తప్పేముంది అని అనుకున్నా, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్‌లో మాత్రం ఆ ధైర్యం అంత ఈజీగా రాదు. ఎందుకంటే ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు మన హావభావాలు, స్వరంలో వచ్చే మార్పులు, కళ్లలో కనిపించే నిజాయితీ లేకపోవడం వంటి సంకేతాలను తెలివైనవారు చాలా త్వరగా పట్టేస్తారు. అందుకే చాలా మంది మనుషులు నేరుగా ఎవరినీ చూసి అబద్ధం చెప్పడానికి వెనుకాడతారు. అవసరమెప్పుడైతే వచ్చినా, అబద్ధం చెప్పే ధైర్యం ముఖాముఖి సంభాషణల్లో చాలా తక్కువే.
కానీ ఇదే విషయం మెసేజ్‌లు, టెక్ట్స్‌లు, చాటింగ్‌లకు వస్తే పూర్తి భిన్న దృశ్యం కనిపిస్తుంది. స్క్రీన్‌పై టైప్ చేసి పంపే మెసేజ్‌ల్లో అబద్ధం చెప్పడం చాలా సులభమని చాలామంది అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అవతలి వ్యక్తి మన ముఖం చూడలేడు, మన హావభావాలు చదవలేడు, మన స్వరంలో మార్పులను గ్రహించలేడు కాబట్టి అబద్ధం చెప్పేవారికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ కారణంగా డిజిటల్ ఇంటరాక్షన్స్‌లో అబద్ధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కార్నెల్ యూనివర్సిటీ నిపుణులు చెప్తున్నారు. జెఫ్ హాన్‌కాక్ నేతృత్వంలోని పరిశోధనా బృందం, 660 మంది విద్యార్థులు సహా వందలాది మందిని పరిశీలిస్తూ వారం రోజులపాటు వారి కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేసింది.
ఈ అధ్యయనంలో బయటపడిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. టెక్స్ట్ మెసేజ్‌లు, చాటింగ్‌లలో అబద్ధాలు చెప్పే శాతం ముఖాముఖి సంభాషణల కంటే పదిరెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు మాత్రం అబద్ధం చెప్పే శాతం కేవలం 5 శాతం మాత్రమే అని తేలింది. అంటే మన స్వరం వినిపించే సంభాషణల్లో కూడా అబద్ధం చెప్పడానికి జనాలు జాగ్రత్తపడతారు. కానీ టెక్ట్స్ రూపంలో ఉన్న కమ్యూనికేషన్లలో అబద్ధాల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి నేటి డిజిటల్ యుగంలో ప్రత్యక్షంగా మాట్లాడే సందర్భాలతో పోలిస్తే, ఆన్‌లైన్ చాటింగ్‌లలో అబద్ధాలు చెప్పే అవకాశాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు.
ALSO READ: Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు హిందువుల్లో కసిని పెంచాయి





