Psychological Horror: ఇదెక్కడి థ్రిల్లర్ సినిమారా బాబూ.. కలలో కూడా వెంటాడే సీన్లు

Psychological Horror: హర్రర్‌ సినిమాలు అంటే ఒక్కసారిగా గుండె ఆగిపోయే జంప్‌ స్కేర్లు మాత్రమే కాదు.. నెమ్మదిగా మనసులోకి చొచ్చుకుపోయే భయం కూడా.

Psychological Horror: హర్రర్‌ సినిమాలు అంటే ఒక్కసారిగా గుండె ఆగిపోయే జంప్‌ స్కేర్లు మాత్రమే కాదు.. నెమ్మదిగా మనసులోకి చొచ్చుకుపోయే భయం కూడా. ముఖ్యంగా సైకలాజికల్‌ హారర్ జానర్‌కు ఈ మధ్య కాలంలో విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. అనుక్షణం ప్రేక్షకులను అప్రమత్తంగా ఉంచుతూ, ఊహించని మలుపులతో కథను నడిపించే సినిమాలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్‌లోనే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా ఇలాంటి కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఉలిక్కిపడే సన్నివేశాలు, మైండ్‌ను షేక్‌ చేసే కథనంతో సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూడాల్సిన సినిమా కోసం వెతుకుతున్నవారికి ఓ హిందీ పారానార్మల్‌ థ్రిల్లర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

హిందీ సైకలాజికల్‌ హారర్‌, పారానార్మల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ‘706’ సినిమా భయాన్ని మరో లెవల్‌లో చూపించే ప్రయత్నం చేసింది. దెయ్యాలు, రాక్షసులే కాదు.. చీకటి, మానసిక భయాలు కూడా ఎంత భయంకరంగా మారతాయో ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుంది. స్లోగా కానీ గట్టిగా ప్రేక్షకులలో టెన్షన్‌ను పెంచుతూ, సినిమా పూర్తయ్యాక కూడా ఆలోచనల్లో మిగిలిపోయేలా కథ సాగుతుంది. హడావుడి లేకుండా, నెమ్మదిగా భయాన్ని నిర్మించే ఈ తరహా కథనం సైకలాజికల్‌ హారర్‌ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

2019లో విడుదలైన ఈ సినిమాకు శ్రవణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. అతుల్‌ కులకర్ణి, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మోహన్‌ అగాషే, అనుపమ్‌ శ్యామ్‌, రాయో ఎస్‌.బఖీర్త, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ యశ్విత్‌ సంచేటి కీలక పాత్రల్లో కనిపించారు. సస్పెన్స్‌, సైకలాజికల్‌ డ్రామా, సూపర్‌నేచురల్‌ అంశాలను సమతూకంగా మేళవిస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఎక్కడా అతి భయపెట్టే ప్రయత్నం చేయకుండా, మానసికంగా ప్రేక్షకులను ఒత్తిడికి గురిచేసే విధంగా నెరేషన్‌ సాగుతుంది.

కథ విషయానికి వస్తే.. లగ్జరీ హాస్పిటల్‌ యజమాని డాక్టర్‌ అనిల్‌ అస్తానా అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో సినిమా మొదలవుతుంది. ఆయన భార్య డాక్టర్‌ సుమన్‌ అస్తానా తన భర్త ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ కేసును డీసీపీ షెకావత్‌ దర్యాప్తు చేస్తుంటాడు. అయితే ఎంత ప్రయత్నించినా స్పష్టమైన ఆధారాలు లభించవు. దీంతో దర్యాప్తు ముందుకు సాగకుండా నిలిచిపోతుంది. ఇదే సమయంలో డాక్టర్లు కూడా గుర్తించలేని ఓ వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కేసు తెరపైకి వస్తుంది. ఆ పిల్లాడి ప్రవర్తన అందరినీ కలవరపెడుతుంది. అతడు డాక్టర్‌ సుమన్‌ అస్తానాను కలవాలని పట్టుబడతాడు.

క్రమంగా ఆ చిన్నారి, డాక్టర్‌ సుమన్‌ అస్తానా, డీసీపీ షెకావత్‌ మధ్య ఓ విచిత్రమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ ముగ్గురినీ ఒకే మిస్టీరియస్‌ నంబర్‌ కలుపుతుంది. అదే 706. ఈ సంఖ్య చుట్టూనే జరుగుతున్న అన్ని సంఘటనలు తిరుగుతాయి. అసలు ఈ నంబర్‌ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? నిజం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథగా సాగుతుంది.

నటీనటుల నటన ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. అతుల్‌ కులకర్ణి, దివ్య దత్తా తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయి పవర్‌ఫుల్‌, ఎమోషనల్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ముఖ్యంగా కథకు అవసరమైన డెప్త్‌ను వారి నటన స్పష్టంగా చూపిస్తుంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ యశ్విత్‌ సంచేటి నటన ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. అతని పాత్ర సినిమా మొత్తం టెన్షన్‌ను కొనసాగించడంలో కీలకంగా నిలుస్తుంది. సపోర్టింగ్‌ క్యాస్ట్‌ కూడా కథను నమ్మదగిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు.

సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రాఫర్‌ వీరేంద్ర కె డార్క్‌, మూడీ అట్మాస్ఫియర్‌ను చాలా ఎఫెక్టివ్‌గా క్యాప్చర్‌ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ భయం, సస్పెన్స్‌ స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్‌ తివారీ ఎడిటింగ్‌ నెరేషన్‌ను టైట్‌గా ఉంచుతూ ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టింది. అమర్‌ మోహిలే సంగీతం సినిమాకు సరైన బ్యాక్‌డ్రాప్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రతా ఖండేకర్‌ పాడిన ‘హై రే ఫరేబి’ పాట హాంటింగ్‌ మెలోడీగా ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.

మొత్తంగా చూస్తే ‘706’ జంప్‌ స్కేర్లపై ఆధారపడే సాధారణ హారర్‌ సినిమా కాదు. ఇది నెమ్మదిగా మనసులో భయాన్ని నాటే సైకలాజికల్‌ థ్రిల్లర్‌. రియాలిటీ, ట్రూత్‌ మధ్య ఉన్న గీతను ప్రశ్నించేలా కథ సాగుతుంది. స్లో బర్నింగ్‌ థ్రిల్లర్స్‌, థాట్‌ ప్రొవోకింగ్‌ హారర్‌ సినిమాలు ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రైమ్‌ వీడియో లేదా యూట్యూబ్‌లో ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది. మైండ్‌ను షేక్‌ చేసే హారర్‌ అనుభూతి కావాలంటే ‘706’ ఒక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

ALSO READ:  విద్యుత్ ఫెన్సింగ్ ప్రాణాంతకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button