Prithviraj Chavan On Op. Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ పూర్తిగా ఓడిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమంటూ కుండబద్దులు కొట్టారు. మే 7న అరగంట పాటు జరిగిన గగనతల యుద్ధంలో భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందన్నారు. దాంతో వైమానిక దళం మిగతా అన్ని యుద్ధ విమానాలను కిందకు దించేసిందని చెప్పుకొచ్చారు. తర్వాత ఒక్కటి కూడా ఎగరలేదన్నారు. ఒకవేళ గ్వాలియర్, బఠిండా, సిర్సా నుంచి యుద్ధ విమానాలను పంపించినా పాకిస్థాన్ కూల్చివేసే ప్రమాదం ఉండడంతో వైమానిక దళం వెనక్కి తగ్గిందని చౌహాన్ చెప్పుకొచ్చారు.
12 లక్షల మంది సైనికులు అవసరమా?
పుణెలో మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ చౌహాన్ ‘ఆపరేషన్ సిందూర్’పై తీవ్ర వివాదాస్పద ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక, క్షిపణి దాడులు మాత్రమే జరిగాయని, పదాతి దళాలు ఒక్క కిలోమీటరు కూడా కదల్లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో యుద్ధాలు జరుగుతాయని, అలాంటప్పుడు 12 లక్షల మంది సైనికులతో ఆర్మీని నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారిని వేరే పనికి వినియోగించుకోవాలని సూచించారు.
చౌహాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
చౌహాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మన సాయుధ దళాలను అవమానించడం, దేశ కోసం చేపట్టే ఆపరేషన్లను చులకన చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. చౌహాన్ మాత్రమే కాదు.. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు మన సైన్యమంటే కాంగ్రెస్కు ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. మన సాయుధ దళాల పరాక్రమాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని, చౌహాన్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెప్పనన్న చౌహాన్
క్షపమాణాలు చెప్పాలన్న బీసేపీ డిమాండ్ పై చౌహాన్ రియాక్ట్ అయ్యారు. తాను క్షమాపణ ఎందుకు చెప్పాలని, ఆ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం తనకు ప్రశ్నించే హక్కు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.





