
మొబైల్ వినియోగదారులకు మరోసారి ఖర్చు పెరగబోతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న కస్టమర్లకు ఇది మరింత భారంగా మారనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా వెల్లడించిన అంచనాల ప్రకారం.. భారతదేశంలో టెలికాం కంపెనీలు త్వరలోనే మరోసారి టారిఫ్‌లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 16 నుంచి 20 శాతం వరకు పెంచాలని టెలికాం సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం.
గత ఎనిమిదేళ్లలో ఇది నాలుగోసారి మొబైల్ టారిఫ్‌ల పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే 2024లో ఒకసారి ధరలు పెరిగిన విషయం వినియోగదారులకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ టారిఫ్ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో 4జీ, 5జీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
ఈ టారిఫ్ హైక్ ప్రభావం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులపై తప్పనిసరిగా పడనుంది. ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ భారాన్ని ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, జియోలో ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా అందించే ప్లాన్ ధర 299 రూపాయలుగా ఉంది. టారిఫ్ పెరిగితే ఇదే ప్లాన్ ధర 347 రూపాయల నుంచి 359 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అదే విధంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకూ షాక్ తగలనుంది. ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో 5జీ సేవలు అందించే ప్లాన్ ధర 349 రూపాయలుగా ఉంది. టారిఫ్ హైక్ అమలైతే ఈ ప్లాన్ ధర 405 రూపాయల నుంచి 419 రూపాయల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.
5జీ నెట్‌వర్క్ విస్తరణ, ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడంతోనే టెలికాం కంపెనీలు టారిఫ్ పెంపు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 5జీ సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయని కంపెనీలు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నాయి. ఈ పెట్టుబడుల భారం చివరకు వినియోగదారులపై పడుతుండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డేటా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మొబైల్ ఫోన్ ఇప్పుడు విలాస వస్తువు కాదు, అవసరంగా మారింది. అలాంటి సమయంలో రీఛార్జ్ ధరలు పెరగడం సామాన్య ప్రజలపై అదనపు భారం మోపినట్లేనని వినియోగదారుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, టెలికాం రంగం నిలదొక్కుకోవాలంటే టారిఫ్ హైక్ తప్పదని పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, 2026లో మొబైల్ వినియోగదారులకు రీఛార్జ్ ఖర్చు మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టారిఫ్ పెంపు ఎప్పుడు, ఎంతవరకు ఉంటుందన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తేలనుంది. అప్పటివరకు వినియోగదారులు మరోసారి తమ జేబు ఖాళీ కావడానికి సిద్ధం కావాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ALSO READ: GOOD NEWS: అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి..!





