
PM Modi: అమెరికా విధించిన 50 శాతం పన్నులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్స్ తో భారత్ పై ఒత్తిడి పెరిగినా, భరించేందుకు రెడీగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. రైతులు, పశు పోషకులు, చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే ఆర్థిక ప్రయోజనాల చుట్టూ ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. రక్షణ, శక్తికి మారుపేరుగా నిలిచిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు.. జాతీయోద్యమంలో రాట్నంపై నూలు వడికి స్వదేశీ దుస్తులు వాడాలన్న మహాత్మాగాంధీ బాటలో భారత్ సాధికారత సాధించిందని మోడీ వెల్లడించారు. దేశ ప్రజలంతా విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ సింధూర్ భారత సైన్య పరాక్రమానికి నిదర్శనం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో సైనికులు కనబరిచిన పరాక్రమం వెలకట్టలేనిదన్నారు. భారత సైన్యం సత్తా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. దిగుమతి కుంభకోణాలకు పాల్పడేందుకు విదేశాలపై దేశం ఆధార పడేలా చేసిందన్నారు. గాంధీజీ స్వదేశీ వస్తు వినియోగం సూత్రాలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసిందని విమర్శించారు. ఆత్మను చిదిమేసి దశాబ్దాలుగా అధికారంలోకి రావడానికి ఆయన పేరును వాడుకుంటుందని ధ్వజమెత్తారు.