
President Murmu: పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ప్రతిపక్షాల ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర అవలోకనం ఇచ్చారు. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, గత పదేళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, పారిశ్రామిక రంగం, సాంకేతికత వంటి అనేక రంగాల్లో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో కూడిన పాలన అందిస్తోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముర్ము తన ప్రసంగంలో వివరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు సైతం త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి పేదలకు అందించామని, పది కోట్ల మందికి పైగా కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆరోగ్య రంగంలోనూ విస్తృత సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షా ఎనభై వేలకుపైగా ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు చికిత్స అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. ఈ చర్యల వల్ల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు. అదే విధంగా గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా తీసుకున్న చర్యలపై కూడా రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు. దేశంలో ధాన్యం ఉత్పత్తి 150 మిలియన్ టన్నులకు చేరడంతో భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆక్వా రంగం, పాల ఉత్పత్తిలోనూ భారత్ ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉందని చెప్పారు. ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తుల్లో ప్రపంచంలో రెండో స్థానాన్ని భారత్ దక్కించుకుందని తెలిపారు.
ఉత్పత్తి రంగంలో చేపట్టిన కీలక సంస్కరణల వల్ల దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని రాష్ట్రపతి వెల్లడించారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరిందని చెప్పారు. అవినీతి రహిత పాలన వల్ల ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించగలుగుతున్నామని, ప్రతి రూపాయి దేశాభివృద్ధికే ఖర్చవుతోందని పేర్కొన్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. భారత్‌ను ఆధునిక సాంకేతిక శక్తిగా మార్చే దిశగా పీఎం సూర్యఘర్ యోజన ద్వారా సామాన్య ప్రజలే విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నారని వివరించారు.
మౌలిక వసతుల అభివృద్ధిలోనూ ప్రభుత్వం కీలక ముందడుగులు వేసిందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని విస్తరించడంతో ప్రజల ప్రయాణ కష్టాలు తగ్గాయని తెలిపారు. న్యూఢిల్లీ నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు నేరుగా రైలు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కుపైగా వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తూ, త్వరలోనే స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగాన్ని ముగించారు.
ALSO RAED: Telangana: స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు?





