
Preschool For Children: ఇప్పటి ప్రపంచం వేగంగా మారిపోతోంది. పనులు, లక్ష్యాలు, బాధ్యతలు అంతు చిక్కనంతగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి జీవితం పరిగెత్తే కాలానికి ప్రతిక్షణం తగులుతోంది. ఆఫీస్ పనులు, వ్యక్తిగత పనులు అనే తేడా లేకుండా, తమ రోజువారీ పని పూర్తి చేసుకోవడానికే సగం సమయం ఖర్చవుతోంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి, స్నేహితులతో రిలాక్స్ అవడానికి కూడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు రెండేళ్లు వచ్చేసరికి ప్లే స్కూల్ లేదా నర్సరీలో చేర్పించడం సహజమైన నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయంపై సమాజంలో రెండు వైపుల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిన్న వీడియో ఈ చర్చను మరింత ముదిర్చింది. అందులో ఉన్న చిన్నారులు ఆకలిగా ఉందని, ఇంటికి వెళ్లాలని టీచర్‌కు వేడుకోవడం చూడగా ఎంతో మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. 2, 3 సంవత్సరాల చిన్నారులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడం పట్ల భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఈ వయస్సులో పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండడం మంచిదని ఒక వర్గం వాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
బాల్యం జీవితం మొత్తానికి పునాది. చిన్నారుల మనసు ఒక శుద్ధమైన గాజు పలక లాంటిది. వారు చూసింది, విన్నది, అనుభవించినదే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఈ చిన్న వయసులో పిల్లలను స్కూల్‌కు పంపడం కంటే ప్రేమతో, ఆప్యాయతతో, భద్రతతో కూడిన గృహ వాతావరణంలో పెరగడం చాలా అవసరమని పేర్కొంటున్నారు.
అయితే మరో వర్గం మాత్రం పిల్లలను ప్రీ స్కూల్‌కు పంపడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించింది. ముఖ్యంగా సామాజికీకరణ. పిల్లలు ఇతర చిన్నారులతో కలవడం, కలిసి ఆడుకోవడం, పంచుకోవడం, మాటల్లోకి రావడం, కొత్త పదాలు నేర్చుకోవడం వంటి అంశాలు ఈ వయస్సులోనే సహజంగా అభివృద్ధి చెందుతాయి. ధైర్యం పెరుగుతుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడటం సహజగానే నేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రీ స్కూల్ ఒక పాజిటివ్ స్టార్ట్ అని కొంతమంది నమ్ముతున్నారు.
పిల్లలు ఇంట్లో ఉండే సమయంలో కూడా అద్భుతమైన లెర్నింగ్ వాతావరణం ఏర్పాటు చేయగలిగితే బయట స్కూల్ అవసరం లేదని వాదించే వర్గం కూడా ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడిపితే, కథలు చెప్పితే, చిన్న చిన్న చిట్కాలు నేర్పితే, వారితో కలిసి ఆడితే, ఇంట్లోనే పెద్ద స్కూల్‌లకు సమానమైన అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు.
ఈ రెండు అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించినా, వాస్తవానికి పిల్లల అవసరం, వారి భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల పని ఒత్తిడి వంటి అంశాలపై ఆధారపడి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల మనస్సు ఏ వాతావరణంలో సంతోషంగా వికసిస్తుందో, అదే వారికి సరైన మార్గం.





