Political Turmoil in Nepal: నేపాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ‘జెన్ జెడ్’ నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన ఘటనకు సంబంధించి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ అరెస్టు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే కేసులో నేపాలీ కాంగ్రెస్కు చెందిన నాయకుడు, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. భక్తపూర్లోని వారి నివాసాల నుంచి ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.
నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా చేసిన ఓలీ
కేపీ శర్మ ఓలీ నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)కి చెందిన ప్రముఖ నాయకుడు. ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిషన్ ఆయనపై విచారణ జరపాలని సిఫార్సు చేయడంతో, ఈ అరెస్టు జరిగింది.
ఇంతకీ అసలు కేసు ఏంటి?
2025 సెప్టెంబర్లో నేపాల్లో భారీ స్థాయిలో యువత తిరుగుబాటు జరిగింది. దీనిని ‘జెన్ జెడ్ విప్లవం’గా పిలుస్తున్నారు. మొదట డిజిటల్ స్వేచ్ఛ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా మారింది. నిరుద్యోగం, అవినీతి, రాజకీయ అస్థిరత వంటి అంశాలపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. దీనివల్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, ఈ ఘటనల్లో కనీసం 77 మంది మరణించగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీసే అవకాశముంది. మాజీ ప్రధానమంత్రి అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
