
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నగరంలోని ప్రముఖ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అయిన “సృష్టి” టెస్ట్ ట్యూబ్ బేబీ హాస్పిటల్‌పై శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అవకతవకలపై అనుమానాల నేపథ్యంలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యురాలు డా. నమృతను పోలీసులు అదుపులోకి తీసుకుని, గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల సోదాల్లో ఆసుపత్రిలోని ప్రాముఖ్యమైన పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని రాత్రి 2:30 వరకు ప్రశ్నించిన పోలీసులు, విచారణ అనంతరం వారిని ఇంటికి పంపినట్టు తెలిసింది.
అధికారికంగా ఈ దాడుల వెనుక ఉన్న కారణాల్ని పోలీసులు ప్రకటించనప్పటికీ, గర్భధారణ చికిత్సల పద్ధతులలో తీవ్ర అనియమాలుంటాయనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఆసుపత్రి నిర్వహణపై ఆరోపణల నేపథ్యంలో తదుపరి దర్యాప్తు కోసం కీలక డేటా సేకరించేందుకు అధికారులు ఈ దాడులు చేసినట్టు భావిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముండగా, ఈ కేసు నిందితుల జాబితా మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.