Duvvada Madhuri Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దివ్వెల మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందు వల్ల వారిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
మొయినాబాద్ లో మాధురి బర్త్ డే వేడుకలు
దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ నిర్వహించారని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో గల ది పెండెంట్ అనే ఫామ్ హౌస్ లో ఈ ఫంక్షన్ ఏర్పాటైంది. దీనికి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో జోరుగా మద్యం పార్టీ సాగింది. నిబంధనల ప్రకారం ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు గానీ, ఫామ్ హౌస్ యాజమాన్యం గానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ పోలీసుల దాడి
ఈ సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించారు. పార్టీని భగ్నం చేశారు. నిర్వాహకుల నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్క బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులకు ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై సంయుక్తంగా దాడి చేసి బర్త్ డే పార్టీని భగ్నం చేశారు.
పోలీసులు అదుపులో మాధురి, శ్రీనివాస్
అనుమతి లేకుండా మద్యం సేవించడం, లిక్కర్ బాటిళ్లను నిల్వ ఉంచడం, బర్త్ డే పార్టీలో శృతి మించిన స్థాయిలో డీజే సౌండ్స్ వినియోగించడం వంటి కారణాలతో పోలీసులు, ఎస్ఓటీ అధికారులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు దివ్వెల మాధురి. కొద్దిరోజుల కిందటే హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. ఆమె పుట్టిన రోజు నాడు వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.





