Narendra Modi West Bengal Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు(17, 18 తేదీల్లో) పశ్చిమబెంగాల్ లో పర్యటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు రాజకీయ ర్యాలీల్లోనూ పాల్గొంటారు. ఎన్నికల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియ, టీఎంసీ రాజకీయ కన్సెల్టెన్సీ ఐ-ప్యాక్ పై ఇటీవల జరిగిన ఈడీ దాడులతో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు రోజుల పాటు మోడీ పర్యటన
రెండు రోజుల పాటు ప్రధాని బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మైనారిటీల ఆధిపత్యం ఉన్న మాల్డాలో ఇవాళ జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. సింగూర్‌లో జరిగే మరో ర్యాలీకి కూడా హాజరవుతారు. ఇవాళ సాయంత్రం మాల్డాకు ప్రధాని చేరుకుంటారని, తొలుత ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత సమీప గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నేత ఒకరు తెలిపారు. ఆదివారం నాడు హుగ్లీలోని సింగూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని, ఆ వెంటనే పబ్లిక్ ర్యాలీకి హాజరవుతారని చెప్పారు. ఆ రాత్రి కోల్ కతాలోనే బస చేస్తారా? లేదా? అనేది మాత్రం వెల్లడించలేదు.
ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు ప్రధాని
ప్రధాని మోడీ ఇవాళ మధ్యాహ్నం 12:45 గంటలకు మాల్డా చేరుకుంటారు. హౌరా-గౌహతి మధ్య నడిచే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఆదివారం నాడు హుగ్లీ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తారు. ఎస్ఐఆర్ పేరుతో సాధారణ పౌరులను బీజేపీ, ఎన్నికల కమిషన్ వేధిస్తోందని.. దీనికి బ్యాలెట్ బాక్స్ వద్దే ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని అధికార టీఎంసీ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. ఈ వాదనలను బీజేపీ తోసిపుచ్చుతోంది. అక్రమ వలసదారులు, రోహింగ్యాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐఆర్ తప్పనిసరని, గణనీయంగా తమ ఓటు బ్యాంకు కోల్పోతోందనే అక్కసుతోనే టీఎంసీ తప్పుడు ఆరోపణలను చేస్తోందని చెబుతోంది.





