అంతర్జాతీయంజాతీయం

Modi-Putin: ప్రొటోకాల్‌ ను పక్కకు పెట్టి, ఎయిర్ పోర్టులో ఎదురెళ్లి…

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. పాలెం ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌ లో దిగిన పుతిన్‌ ను ప్రధాని మోడీ ప్రొటోకాల్ ను దూరం పెట్టి.. స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు.

PM Modi Welcomes Putin: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలెం ఎయిర్‌ పోర్టులో దిగిన పుతిన్‌కు.. ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రధాని నరేంద్రమోడీసాదర స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తుండగా.. విమానం దిగిన పుతిన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఓకే కారులో ప్రయాణం

సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్‌ను.. ప్రధాని మోడీ తన టొయోటా ఫార్చ్యూనర్‌ కారులో తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు.ఈ విషయాన్ని చెప్తూ, సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి, రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్‌-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది. మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది” అని రాసుకొచ్చారు. ఆ తర్వాత పుతిన్‌కు ఆయన ప్రైవేటు విందు ఇచ్చారు. పుతిన్‌ రాక సందర్భంగా మోడీ అధికారిక నివాసాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్‌తో పాటు వచ్చిన బృందంలో ఏడుగురు రష్యన్‌ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌ ఉన్నారు.

ఇదే తొలిసారి కాదు.. 

ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రధాని మోడీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించడాన్ని అంతా ఆసక్తిగా చూశారు. అయితే, మోడీ ఇలా వేరే దేశాల అధినేతలను ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన 11 ఏళ్లలో ఆయన 6 సందర్భాల్లో ఇలా వెళ్లారు. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను, 2017లో బంగ్లాదేశ్‌ పీఎం షేక్‌ హసీనాను, జపాన్‌ ప్రధాని షింజో అబెను, 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను, 2024 జనవరిలో యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ ను, 2025 ఫిబ్రవరిలో ఖతార్‌ అమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ ను స్వయంగా ఆహ్వానించారు.

అప్పట్లో పుతిన్.. ఇప్పుడు మోడీ

గత ఏడాది ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు.. మాస్కోలో ఆయనకు పుతిన్‌ ప్రైవేట్‌ డిన్నర్‌ ఇచ్చారు! దానికి ప్రతిగా మోడీ.. గురువారం రాత్రి పుతిన్‌కు ప్రైవేటు డిన్నర్‌ ఇచ్చారు. మూడు నెలల క్రితం చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సమయంలో.. మోడీని పుతిన్‌ తన కారులో ఎక్కించుకుని దాదాపు 45 నిమిషాలపాటు అందులోనే చర్చలు జరిపారు. గురువారం రాత్రి ప్రధాని మోడీ పుతిన్‌ను తన టొయోటో ఫార్చ్యూనర్‌ కారులో ఎక్కించుకుని తన అధికారిక నివాసానికి తీసుళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button