
Cross Border Terror:ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరాటానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మద్దతు పలికారు. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సు కోసం చైనాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని మోడీ ప్రస్తావించగా, జిన్ పింగ్ భారత్ కు మద్దతు తెలిపిన్టటు విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెంపు, సరిహద్దుల్లో శాంతి నెలకొనడం, ఉభయదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలపై ప్రధానంగా మోడీ, జిన్ పింగ్ చర్చించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ఉగ్రవాదంపై పోరుకు చైనా మద్దతు
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జి న్‌పింగ్ దృష్టికి మోడీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు. పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉండే చైనా గత జూన్‌లో జరిగిన ఎస్‌సీఓ మీట్‌లో పహల్గాం ఉగ్రదాడిని సంయుక్త ప్రకటనలో ప్రస్తావించలేదు. దీంతో సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు ఇండియా నిరాకరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి బదులు బలోచిస్థాన్‌లో ఘటనలను ఆ ప్రకటనలో చైనా ప్రస్తావించింది. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై అక్కసు వెళ్లగక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ తొలుత భారత్‌పై 25 శాతం సుంకాలు విధించి, అదనంగా మరో 25 శాతం సుంకాలు పెంచారు. ఈ క్రమంలో ఇండో-చైనా తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ అంశాలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉభయనేతలు నిర్ణయానికి వచ్చినట్లు విక్రమ్ మిస్రీ చెప్పారు.