అంతర్జాతీయం

అఫ్ఘనిస్తాన్‌ లో తీవ్ర భూకంపం, ఆదుకుంటామన్న ప్రధాని మోడీ!

Modi On Afganistan Earthquake: అఫ్ఘనిస్తాన్‌ లో సంభవించిన భారీ భూకంపం వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భూకంపం దాటికి నష్టపోయిన అఫ్ఘాన్‌ కు అన్నిరకాల మానవతా సాయాన్ని అందిస్తామన్నారు. చైనా పర్యటనలో ఉన్న మోడీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘అఫ్ఘాన్‌ భూకంపంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ విపత్తులో కుటుంబసభ్యులు, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల మానవతా సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది”అని మోడీ వెల్లడించారు.

టెంట్లు, ఆహార సామగ్రి పంపిన భారత్

అఫ్ఘాన్‌ భూకంపంలో పెద్దఎత్తున ప్రాణనష్టం జరగడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆదేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖికి సంతాపం తెలియజేశారు. భారత్ అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. టెంట్లు, ఆహార సరఫారాలు, ఇతర సహాయక సామాగ్రిని అఫ్ఘాన్‌కు పంపుతున్నట్టు తెలిపారు. తక్షణ సాయం కింద భారత్‌ 15 టన్నుల ఆహార పదార్థాలను కాబూల్‌ నుంచి కునార్‌కు పంపినట్లు తెలిపారు. 1,000 ఫ్యామిలీ టెంట్లను పంపించినట్టు వెల్లడించారు. మంగళవారం నుంచి పలు రకాల సహాయ సామగ్రిని పంపిస్తామని చెప్పారు.

800 మంది మృతి, 2,500 మందికి పైగా గాయాలు

అఫ్ఘాన్‌లో ఆదివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ క్లిష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button