
PM Modi Call To President Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే మార్గాలపై కూడా చర్చించారు. మాక్రాన్ తో ఫోన్ కాల్ కు సంబంధించిన వివరాలను, సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం సాధ్యమైనంత త్వరలో ముగిసేందుకు చేయాల్సిన ప్రయత్నాలతో సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించడంలో ఇండియా-ఫ్యాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్టు ప్రధాని మోడీ చెప్పారు.
ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు రావాలని పిలుపు
అటు 2026 ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు హాజరుకావాలని మాక్రాన్ ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. మాక్రాన్ అందుకు అంగీకరించినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత కోసం ఇరుదేశాలు ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ, కలిసి పనిచేయాలని కూడా ఉభయనేతలు నిర్ణయించినట్టు వెల్లడించింది. గత నెల రోజుల్లో మోడీ-మాక్రాన్ ఫోనులో సంభాషించుకోవడం ఇది రెండోసారి. ఆగస్టు 21 మోడీకి మాక్రాన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై శాంతియుత పరిష్కారం కనుగొనే విషయంపై ఇద్దరు నాయకులు చర్చించారు.