జాతీయం

ఎర్రకోటపై 12వసారి జెండా ఎగరేసిన ప్రధాని మోడీ - పాకిస్తాన్‌కు ఘాటు హెచ్చరిక

పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ చేసిన న్యూక్లియర్ బెదిరింపులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “ఇలాంటి బెదిరింపులకు భారత్ భయపడదు.

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఎగరేశారు. స్వతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, సైనికాధికారులు, రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, అలాగే వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. వేడుకలకు ముందు, ప్రధాని మోడీ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు.

జెండా ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ, ఈ రోజు ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ “పంద్రాగస్ట్ అనేది 140 కోట్ల భారతీయులందరూ పండుగ చేసుకునే రోజు. ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంట మువ్వన్నెల జెండా ఎగురాలి” అన్నారు. స్వాతంత్ర్యం కోట్లాది మంది త్యాగాల ఫలితమని, దేశ ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, పేదరిక నిర్మూలన, మరియు ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ పెంచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు అందరి భాగస్వామ్యంతోనే “వికసిత భారత్” సాధ్యమని అన్నారు.

పాకిస్తాన్‌కు ఘాటు హెచ్చరిక : స్వతంత్ర దినోత్సవ వేదిక నుంచి పాకిస్తాన్‌పై మోడీ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ చేసిన న్యూక్లియర్ బెదిరింపులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “ఇలాంటి బెదిరింపులకు భారత్ భయపడదు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ గతంలో నడిచింది కానీ ఇప్పుడు నడవదు. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే వారిని భారత్ వేరుగా చూడదు. వారంతా మానవత్వానికి ముప్పు” అని ఘాటుగా హెచ్చరించారు. ఉగ్రవాదానికి తావివ్వకుండా, సరిహద్దుల వద్ద శాంతిని కాపాడాలని, కానీ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీపడబోమని స్పష్టం చేశారు.

 దేశ ఐక్యత, సమైక్యత పిలుపు : దేశ ప్రజలందరికీ ఐక్యత, సామరస్యతకు పిలుపునిచ్చిన మోడీ, “ప్రతి పౌరుడు అభివృద్ధి యాత్రలో భాగస్వామి కావాలి. మనం కలిసి పనిచేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలం” అన్నారు. ప్రతి ఇంట మువ్వన్నెల జెండా ఎగరేలా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2014లో మొదటిసారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన మోడీ, ఈ ఏడాదికి వరుసగా 12వసారి ఈ గౌరవాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం, దేశీయ మరియు అంతర్జాతీయ రాజకీయ సంకేతాల మేళవింపుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button