భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరస్థితులు ఉన్నా, భారతదేశం అపూర్వమైన నిశ్చయత దశ ను చూస్తోందన్నారు. పరోక్షంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఇటీవల రాజకీయ కల్లోలాలను ప్రస్తావించారు.
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్స్
రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్ ఫర్ కచ్ అండ్ సౌరాష్ట్ర రీజియన్‌లో ప్రధాని మోడీ పాల్గొన్ని ప్రసంగించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్స్ అనే విజయ మంత్రమే భారతదేశ వృద్ధిని ప్రతిబింబిస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ అవసరం ఉందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గుజరాత్ గ్రోత్ ఇంజన్‌లా మారిందని, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలు అవకాశాలకే పరిమితం కాకుండా దేశ ప్రగతికి బలమైన పునాదిగా మారాయని ప్రశంసించారు.
పాల ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా తన స్థానాన్ని పదిలం చేసుకుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులు సరికొత్త రికార్డులను సృష్టించాయి. పాల ఉత్పత్తిలో నెంబర్ వన్ రికార్డు మనదేనన్నారు. వ్యాక్సిన్ల అతి పెద్ద ఉత్పత్తిదారు కూడా ఇండియానే అని చెప్పుకొచ్చారు. గత 11 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారుగా కూడా ఇండియా నిలిచిందన్నారు.
సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
మూడురోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ లోని సోమనాథ్‌కు వెళ్లిన ప్రధాని ఆదివారం నాడు స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా శౌర్య యాత్రలో పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి ముందు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.





