Modi On G20 Summit: ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గ్లోబల్ కాంపాక్ట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ20 సదస్సు మూడో సెషన్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “అందరికీ పారదర్శకమైన, న్యాయమైన భవిష్యత్తు- కీలక ఖనిజాలు-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్” అంశాలపై జరిగిన చర్యలు ప్రధాని మోడీ కీలక ఉపన్యాసం చేశారు. ఏఐ వినియోగంలో తగిన మానవ పర్యవేక్షణ, డిజైన్ సేఫ్టీ, పారదర్శకత ఉండాలన్నారు. డీప్ ఫేక్‌కు, నేరాలు, ఉగ్రవాద కార్యకాలాపాలకు ఏఐని వినియోగించకుండా కఠిన పరిమితులు విధించాలని సూచించారు. ఏఐ వ్యవస్థను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని మరింత పెంచేదిగా ఉండాలని, అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యత మాత్రం మనుషుల చేతిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఏఐ పట్ల నేటి ఉద్యోగాలుగా ఉన్న అభిప్రాయం.. రేపటి సామర్థ్యాలుగా మారాలన్నారు. ఈ విషయంలో వేగవంతమైన సృజనాత్మకత కోసం చైతన్యవంతమైన ప్రతిభ అవసరమన్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న జీ20 తదుపరి సదస్సులో ఈ అంశాన్ని చేరుస్తామని చెప్పారు. భారత్‌లో ఏఐ ప్రయోజనాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందేలా తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఇండియా-ఏఐ మిషన్‌ను చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏఐ సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు జీ20 దేశాలన్నీ హాజరు కావాలని కోరారు.
భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం!
అటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అనివార్యమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ప్రపంచ పరిపాలనా వ్యవస్థలోనే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల గ్రూప్ సందేశం ఇవ్వాలన్నారు. ఐబీఎస్‌ఏ నేతల సదస్సులో మాట్లాడిన ప్రధాని.. ప్రపంచం చీలికలకు, విభజనకు గురవుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఐక్యత, సహకారం, మానవత్వ సందేశాన్ని ఐబీఎస్‌ఏ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని దక్షిణాఫ్రికా, బ్రెజిల్ అధ్యక్షులు సిరిల్ రమఫోసా, లులా డా సిల్వకు భారత ప్రధాని సూచించారు.





