అంతర్జాతీయం

జపాన్ కు చేరిన ప్రధాని మోడీ, టోక్యోలో ఘన స్వాగతం

Modi Japan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం జపాన్ కు చేరుకున్నారు. టోక్యోలో ఆయనకు జపాన్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోడీని స్వాగతించారు.   గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన, ఉదయం జపాన్ లో అడుగు పెట్టారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఇవాళ, రేపు ఆదేశంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భారత్‌-జపాన్‌ 15వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ చివరిసారి 2023 మేలో జపాన్‌లో పర్యటించారు.

రెండు దేశాల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. జపాన్‌- భారత్‌ మధ్య సంబంధాలు గత 11 ఏళ్లుగా స్థిరమైన, గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు.ఉమ్మడి సవాళ్లను పరిష్కరించేందుకు, ప్రాంతీయ సహకారాన్ని విస్తృతం చేసేందుకు ఎస్‌సీవో సభ్యదేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్, రష్యా అధినేత పుతిన్ తదితరులతో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు.

జపాన్ పర్యటన తర్వాత చైనాకు పయనం

జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్లనున్నారు. తియాంజిన్‌ లో ఈ నెల 31, సెప్టెంబర్‌ 1న జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ప్రధాని మోడీ చివరిసారి 2018లో పర్యటించారు.

Back to top button