ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రచ్చ మొదలైంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చిచ్చు రేపింది. టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. టీటీడీ చైర్మెన్ మాత్రం ఆయన్ను లైట్ తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం టీటీడీ పాలకమండలి సమావేశం తర్వాత నాయుడు చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి. జన సైనికులు టీటీడీ చైర్మెన్ పై విరుచుకుపడుతున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు టీటీడీ కూడా క్షమాపణలు చెప్పాలి స్వయంగా నేను కూడా క్షమాపణలు చెప్పాను అని అన్నారు. ఈ వ్యాఖ్యలను నాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. ఎవరో ఏదో మాట్లాడితే వాటికి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో పవన్ కామెంట్లను బీఆర్ నాయుడు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పవన్ అంత సీరియస్ గా మాట్లాడితే.. ఎవరో ఒకరు మాట్లాడితే అంటూ బీఆర్ నాయుడు కామెంట్ చేయడాన్ని జనసేన నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జనసైనికులు బీఆర్ నాయుడిని టార్గెట్ చేయడంతో టీడీపీలో ఆందోళన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య చేశానని చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదన్నారు.తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.