
మెగా బ్రదర్ నాగబాబుకు ఏ పదవి ఇస్తారు..? అన్న చర్చకు తెరపడింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత… నాగబాబును ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత.. ఎమ్మెల్సీ కాదు.. రాజ్యసభకు పంపుతారన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ… నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కనుక.. నాగబాబు ఎన్నిక లాంఛనం కానుంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత.. ఆయన్ను కేబినెట్‌లోకి కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం చంద్రబాబుతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం గురించి చర్చించినట్టు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వడం కుదరకపోతే… రాజ్యసభకు పంపాలని నిర్ణయించారట. జనసేన నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు కనుక.. నాగబాబును రాజ్యసభకు పంపితే బాగుంటుందని జనసేనాని కూడా భావించారట. రాజ్యసభకు ఎన్నిక వచ్చేలోపు.. కేబినెట్ హోదా ఉండే… కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించారట. అయితే… ఇంతలో ఏమైందో ఏమో… ? మళ్లీ సమీకరణాలు మార్చుకుని… నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు చేసినట్టు సమాచారం.
నాగబాబు ముందు రాజ్యసభ స్థానం ఆశించారు. కానీ.. కొన్ని రాజకీయ సమీకరణాలు, అప్పటి పరిస్థితులను బట్టి… అది కుదరలేదు. ఆ తర్వాత.. ఆయనకు ఏ పదవి ఇవ్వాలని.. పార్టీలో ఏ స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు.. సమయం వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబును అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.