
Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే ప్రకటన చేశారు. తన స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చాలనుకునే 37 ఏళ్ల లోపు మహిళలకు ఐవీఎఫ్ చికిత్సకు అవసరమైన నిధులను తానే భరిస్తానని ప్రకటించారు. 41 ఏళ్ల దురోవ్ ఇప్పటికే ఆరుగురు పిల్లలకు తండ్రి అని, స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా పిల్లలు జన్మించారని వెల్లడించారు. తన స్పెర్మ్‌తో పుట్టిన పిల్లలందరికీ తన సంపదలో సమాన వాటా అందిస్తానని ప్రకటించడంతో ఈ విషయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుండటంపై దురోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం, జీవనశైలి మార్పులు, రేడియేషన్ ప్రభావాల వల్ల స్పెర్మ్ కౌంట్ గణనీయంగా పడిపోతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో స్పెర్మ్ డొనేషన్‌ను కేవలం వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని దురోవ్ స్పష్టం చేశారు. ఐవీఎఫ్ క్లినిక్‌లు అధిక నాణ్యమైన వీర్యం కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాను సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
మాస్కోలోని ఓ ప్రముఖ సంతానోత్పత్తి క్లినిక్‌లో దురోవ్ స్పెర్మ్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇక్కడ 37 ఏళ్ల లోపు పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్ చికిత్స ద్వారా గర్భధారణ అవకాశాలు కల్పిస్తున్నారు. దురోవ్ జన్యుపరమైన వివరాలు ఐవీఎఫ్‌కు అనుకూలమని క్లినిక్ ప్రచారం చేస్తుండగా, అర్హులైన మహిళలకు చికిత్స ఖర్చులను దురోవ్ స్వయంగా భరిస్తాడని సమాచారం. 2010లో తన స్నేహితురాలికి సహాయం చేయాలనే ఉద్దేశంతో తొలిసారి స్పెర్మ్ డొనేషన్ ప్రారంభించానని, ఆ తరువాత ఆరోగ్యకరమైన డోనార్ల కొరత తెలుసుకుని కొనసాగిస్తున్నానని దురోవ్ తెలిపారు. ఇప్పటికే 12 దేశాల్లోని కుటుంబాలకు తన స్పెర్మ్ ద్వారా సాయం అందిందని చెప్పారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దురోవ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తన డీఎన్ఏ సమాచారాన్ని ఓపెన్ సోర్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నానన్నారు. తన జీవసంబంధమైన పిల్లలు ఒకరినొకరు గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా 2024లో టెలిగ్రామ్‌పై తీవ్రవాద కంటెంట్ ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు. సుమారు 17 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన ఆయన.. 5.6 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై బెయిల్ పొందారు. పునరుత్పత్తి, జనాభా తగ్గుదల అంశాలపై దురోవ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.





