కొన్నిసార్లు ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తే, చిరవకు మరొకటై.. లేని తిప్పలు తెచ్చి పెడుతుంది. ఇంకా చెప్పాలంటే తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలుస్తుంది. ఓ యువకుడి విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. ప్లాన్ బెడిసికొట్టి జైలు పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళలో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పతనంతిట్ట జిల్లాకు చెందిన రంజిత్ రాజన్ ఓ యువతిని ప్రేమించాడు. కానీ, వీరిద్దరి ప్రేమను యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. యువతికి మరొకరితో పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలిసిన రంజిత్ తన లవర్ కుటుంబ సభ్యుల ముందు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. ప్రియురాలిని కారుతో ఢీ కొట్టించి.. తానే కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి ఆమె కుటుంబసభ్యుల ముందు హీరో అనిపించుకోవాలని స్కెచ్ వేశాడు.
యువతి కోచింగ్ సెంటర్ నుంచి వస్తుండగా..
తాజాగా ఆ యువతి కోచింగ్ ముగించుకొని స్కూటర్‌పై వెళ్తుండగా.. రంజిత్ స్నేహితుడు ఏజెస్ (19) ఆమెను కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఆ ప్రమాదంలో యువతి మోచేయి, చేతి వేలు విరిగింది. మరో కారులో వచ్చిన రంజిత్ ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించాడు. తాను చేసిన పనికి ఆ యువతి కుటుంబ సభ్యులు తనను హీరోగా భావిస్తారని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది.
రంజిత్ ప్లాన్ యువతికి తెలియడంతో..
రంజిత్ వేసిన ప్లాన్ ఆ యువతికి తెలియకపోవడంతో ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని క్షుణ్ణంగా పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా ఏజెస్‌ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పోలీసులు రంజిత్, ఏజెస్ ని హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ చేశారు.





