క్రైమ్

పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్విస్ట్.. అసలు నిజం చెప్పబోతున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్‌ పగడాల డెత్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. రాజమండ్రి శివారులో రోడ్డు పక్కన ప్రవీణ్ చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావచ్చింది. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడని కొందరు చెబుతుండగా.. లేదు ఆయనను హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కేసు రాజమండ్రి పోలీసులకు సవాల్ గా మారింది.

పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు కోసం 15 బృందాలను రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బయలు దేరినప్పటి నుంచి రోడ్డు పక్కన పడిపోయిన స్పాట్ వరకు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. వేలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ కదలికలకు సంబంధించి మినిట్ టు మినిట్ రిపోర్ట్ తయారు చేశారు. ప్రవీణ్ కేసును చేధించేందుకు వివిధ ప్రాంతాల్లో ఆధారాలు సేకరించిన పోలీసులు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఓ అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు దర్యాప్తు వివరాలు వెళ్లడించే అవకాశాలున్నాయి.

మరోవైపు పాస్టర్‌ని హత్య చేశారని సోషల్‌ మీడియాల్లో మాట్లాడిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారి వద్ద ఉన్న ఆధారాలను అందజేయాలని కోరారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు అందలేవని దర్యాప్తు అధికారులు అంటున్నారు. మరోసారి నోటీసు ఇస్తామంటున్నారు. అలాగే ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన పలువురు పాస్టర్లకూ నోటీసులు ఇచ్చి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పాస్టర్‌ మృతిపై ఎవరికైనా అనుమానాలుంటే ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేయాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button