క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం కాల్పుల కలకలం స్థానికులను బయంబ్రాంతులకు గురిచేసింది . ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 31, 2026 ఉదయం దాదాపు 7 గంటల సమయంలో కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రధాన కార్యాలయ సమీపంలోని ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
నాంపల్లికి చెందిన రిన్షాద్ అనే వస్త్ర వ్యాపారి ₹6 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ప్రధాన కార్యాలయ సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు. అతను నగదు జమ చేస్తుండగా, బైక్‌పై వెంబడించిన ఇద్దరు దుండగులు అతనిని అడ్డుకున్నారు.
రిన్షాద్ ప్రతిఘటించడంతో, నిందితులు అతని కాలిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. నిందితులు ₹6 లక్షల నగదు ఉన్న బ్యాగును, అలాగే బాధితుడి బైక్‌ను TS 08 HN 8582 ఎత్తుకెళ్లి పరారయ్యారు. గాయపడిన రిన్షాద్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు, అతని ప్రాణానికి ముప్పు లేదని వైద్యులు తెలిపారు.
సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగుతోంది.





