
క్రైమ్ మిర్రర్, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేష్ (41) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. పోలీసుల సమాచారం ప్రకారం, విధి నిర్వహణలో భాగంగా వెంకటేష్ సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయంకు వెళ్లారు. విధుల్లో ఉండగానే అతనికి హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో, సహచరులు తక్షణమే పక్కనే ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వెంకటేష్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంచాల గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆకస్మిక మరణంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.