
Oh My God: మన దేశంలో కూరగాయల ధరలు పెరగడం సాధారణ విషయమే అయినప్పటికీ, చికెన్ మరియు మటన్ వంటి మాంసాహార పదార్థాల రేట్లు కూడా తరచూ భారీ ఎత్తున పెరిగిపోతుంటాయి. అయితే ఇప్పటివరకు సామాన్యులకి అందుబాటులో ఉండే ఏకైక ఆహార పదార్థం కోడి గుడ్డే. ధర ఎక్కువైనా ఆరు నుంచి ఏడు రూపాయల వరకే ఉండటం వల్ల ఎక్కువగా మాంసాహారం కొనలేని కుటుంబాలు కూడా గుడ్డు కూర వండుకుని తమ అవసరాన్ని తీర్చుకునేవారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లు సామాన్యుడి చేతికి అందిన కోడి గుడ్డు ధర ఒక్కసారిగా పెరిగి కొండెక్కింది. ప్రస్తుతం డజన్ గుడ్ల ధర వంద రూపాయలకు చేరువలో ఉండటం వల్ల ప్రజలు తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇది జరగటం మరింత ఆశ్చర్యంగా మారింది.
సాధారణంగా శ్రావణం, కార్తీకం వంటి పవిత్రమైన మాసాల్లో అనేక మంది మాంసాహారం తినడం మానేస్తారు. దీనివల్ల కోడి, మటన్, గుడ్డు వంటి పదార్థాల ధరలు పడిపోవడం, మరోవైపు కూరగాయల రేట్లు పెరగడం సహజం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కార్తీక మాసం ముగిసి వచ్చే రెండు రోజులు మాత్రమే ఉండగా, కూరగాయల ధరలు పెరగాల్సిన సమయంలో గుడ్ల ధరలు మాత్రం అంచనాలకు మించి ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్లో డజన్ గుడ్లు 98 రూపాయలు పలుకుతున్నాయి. ఈ పెరుగుదల వెనుక కారణం తాజాగా వచ్చిన మొంథా తుఫాన్ ప్రభావమే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్ కారణంగా ఉత్పత్తి మరియు సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, మార్కెట్లో గుడ్ల లభ్యత తగ్గిపోవడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయని వారు పేర్కొంటున్నారు.
ఇక కూరగాయల పరిస్థితి చూస్తే శీతాకాలంలో కూడా టమాటా ధర భారీగా ఉండటం, కిలోకు 50 రూపాయల వరకు అమ్మబడటం, అనేక కూరగాయలు కిలోకు 100 రూపాయలకు చేరుకోవటం కూడా ప్రజల ఖర్చులను మరింత పెంచింది. ఈ జాబితాలో ఇప్పుడు గుడ్డు కూడా చేరడంతో సామాన్యులు ఏది కొనాలా అనే ఆలోచనలో పడిపోయారు. గతంలో కిలో చికెన్ ధర 240 నుంచి 260 రూపాయల మధ్య ఉండగా, కార్తీక మాసం రావడంతో ఆ రేటు తగ్గింది. కానీ మాంసం తగ్గిన వెంటనే గుడ్ల ధర పెరగడం ప్రజలకు అర్థంకాని పరిస్థితిని సృష్టించింది. వ్యాపారులు మాత్రం దీనికి డిమాండ్ పెరగడం, అలాగే సరఫరా తగ్గిపోవడమే కారణమని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి ఉండటంతో సామాన్యులు గుడ్లను కూడా సులభంగా కొనలేని పరిస్థితి ఏర్పడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Hidden Cameras: హోటల్‌లో సీక్రెట్ కెమెరా ఉందనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..





