సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందలాది వార్తలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే తాజాగా వైరల్ అయిన ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.9.34 బాకీ పేరుతో ఓ రైతుకు బ్యాంకు నుంచి వరుసగా నోటీసులు రావడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. చిన్న మొత్తం అయినప్పటికీ బాకీ ఉందని చెప్పుతూ సందేశాలు పంపిన ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన చొక్కన్న గౌడ అనే రైతు పంట రుణం కింద రూ.50,000 అప్పుగా తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాడు. అయితే వడ్డీ లెక్కల్లో రూ.9.34 మాత్రమే మిగిలిపోయిందని బ్యాంకు గుర్తించింది. ఆ మొత్తాన్ని కూడా తప్పనిసరిగా చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వెళ్లాయి. రైతు స్పందించకపోవడంతో ఫోన్ సందేశాలు వరుసగా పంపినట్లు సమాచారం. చిన్న మొత్తం అయినప్పటికీ వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ ఘటనతో స్పష్టమైందని స్థానికులు అంటున్నారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రైతు నేరుగా బ్యాంకుకు వెళ్లి రూ.10 చెల్లించాడు. అయితే అక్కడితో ఆగకుండా మిగిలిన రూ.0.66 తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు. తన నుంచి రూ.9.34 వసూలు చేసినట్లే మిగిలిన పైసలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని నిలదీశాడు. రూ.0.66 అందించే వరకు బ్యాంకు నుంచి బయటకు వెళ్లబోనని అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ అనూహ్య పరిణామంతో బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు.
చిన్న మొత్తం కోసం ఇంత పట్టుదల ఎందుకని ప్రశ్నించినప్పటికీ రైతు వెనక్కి తగ్గలేదు. నిబంధనలు ఒకరికి ఎలా వర్తిస్తాయో, అందరికీ అలాగే వర్తించాలనే తన వాదనను స్పష్టంగా వ్యక్తం చేశాడు. చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు సమాచారం. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అనేక మంది రైతుకు మద్దతుగా స్పందిస్తున్నారు.
రూ.9.34 కోసం ఇంత కఠినంగా వ్యవహరించిన బ్యాంకు, రైతు అడిగిన రూ.0.66 ఇవ్వడంలో ఎందుకు వెనుకడుగు వేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజల పట్ల వ్యవస్థ చూపే వైఖరి ఎలా ఉంటుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న మొత్తమైనా న్యాయం విషయంలో రాజీ పడకూడదనే సందేశాన్ని ఈ రైతు తన చర్యతో అందించాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారి విస్తృత చర్చకు దారి తీసింది.
ALSO READ: మారువేశంలో చెకింగ్‌కు వెళ్లిన కలెక్టర్.. అసలు విషయం తెలియక సిబ్బంది దురుసు ప్రవర్తన
