
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఏకగ్రీవం కానున్నాయి. బలానికి మించి అభ్యర్థులను పెట్టడం.. ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలతో విరుచుపడటం… గెలుపు కోసం డబ్బులు కుమ్మరించడం.. ఇవన్నీ ఈసారి కనిపించవు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ.. ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ… రెండూ.. తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యకు తగ్గట్టే అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం లేదు.
తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు స్థానాల్లో నాలుగు ఎమ్మెల్సీలను గెలిపించుకునే సత్తా అధికార కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ రెండో అభ్యర్థిని నిలబెడుతుందని వార్తలు వచ్చాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రెండో అభ్యర్థిని బరిలో దించే ఆలోచనలో గులాబి పార్టీ ఉందని ఆఖరి నిమిషం వరకు కథనాలు వినిపించాయి. కానీ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… ఒక్క అభ్యర్థినే ప్రకటించారు. దాసోజు శ్రవణ్‌కు అవకాశం ఇచ్చారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సిన నాలుగు స్థానాల్లో ఒకటి.. పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చేసింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్న చోట.. అభ్యర్థిని పోటీకి దింపలేదు. దీంతో… పోలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో (సోమవారం) సాయంత్రంతో ముగుస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 20న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే.. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో… ఎన్నిక వచ్చే అవకాశం లేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవగానే… ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయినట్టు ప్రకటించడం లాంఛనమే.