
కల్వకుర్తి,క్రైమ్ మిర్రర్:- కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధికార యంత్రాంగంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కల్వకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా ఇందిరమ్మ గృహ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల అంశంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా స్పందించారు. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్నప్పటికీ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి తక్షణమే బిల్లులు మంజూరు చేసి, చెల్లింపులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
Read also : మంత్రి గడ్డం వివేక్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు
అదేవిధంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, కొత్త కనెక్షన్లు, లోడ్ సమస్యలు వంటి అంశాలను గ్రామాల వారీగా సమీక్షించి, సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలను నివారించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొని, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేకు వివరించారు.
Read also : కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. స్టేటస్ చెక్ చేసుకోండిలా!





