Monday, February 16, 2026
Homeరాజకీయంబీఆర్ఎస్ కి ఓటమి అలవాటైందా...?

బీఆర్ఎస్ కి ఓటమి అలవాటైందా…?

• పరాజయాలపై బీఆర్ఎస్ లో రాని మార్పు
• వరుస ఎన్నికల్లో ఓడిపోతున్నా అదే తీరు
• కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందనే భ్రమ
• అధినేత ఫాంహౌస్ దాటకపోవడంతో పార్టీపై ప్రభావం
• ఇంకా అన్ని వర్గాల ఆమోదం పొందని కేటీఆర్
• హరీశ్ రావుకు పరిమితులు విధిస్తుండడంతోనష్టం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఓడలు బండ్లవుతాయి.. అంటే ఇదేనేమో! తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి ఇందుకు అద్దం పడుతుంది. పదేళ్లపాటు తిరుగులేని విజయాలు.. అడ్డేలేనంత బలమైన అధికారం. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అన్న స్థాయి.

నుంచి ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యమ స్థాయి నుంచి జాతీయ రాజకీయాల వరకు వెళ్లిన ప్రయాణం.. ఒక్కసారిగా పాతాళానికి ఎందుకు పడిపోయింది? ఈ పతనానికి బాధ్యులెవరు? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.

ఓటరు నాడిని పసిగట్టడంలో బీఆర్ఎస్ నాయకత్వం వరుసగా విఫలమవుతుండడం.. కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్.. సొంత ఇంట్లోనే ఎందుకు పరాజయం పాలవుతోందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం బీఆర్ఎస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని అంటున్నారు.

క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం చెక్కు చెదరకపోయినా, పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి ఆకట్టుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం వైఫల్యం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. పైగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తేలిగ్గా తీసుకునే ప్రయత్నాలు చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత.. కేటీఆర్ మాట్లాడుతూ తాము 30కి పైగా స్థానాలు గెలుచుకుంటామని ఆశిస్తే, 17 వచ్చాయని అన్నారు.

బీజేపీకి అసలు ఒక్కస్థానం కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ ఇలా మాట్లాడటం చూసిన వారు మున్సిపల్ ఎన్నికల్లో అపజయాన్ని అంగీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదని అంటున్నారు. మొత్తం పోటీ చేసిన స్థానాలు కాకుండా, ఆశించిన స్థానాల్లో సగం గెలుచుకోవడం గొప్పగా బీఆర్ఎస్ భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు.

• తమ పట్ల వ్యతిరేకతను గుర్తించని నాయకత్వం..
మున్సిపల్ ఎన్నికలే కాదు.. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నుంచి నేటి వరకు ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ప్రభావం చూపలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సరైన రీతిలో పనిచేయకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న భావనపైనే బీఆర్ఎస్ ఉండిపోయిందని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఉన్న వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతగా భావిస్తూ తప్పులో కాలేస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆ స్థానంలో చూడటానికి బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికీ ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే ఎక్కువ నష్టపోతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

• కేసీఆర్ వ్యవహార శైలితో ఇబ్బంది..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారశైలి కూడా పార్టీని దెబ్బతీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ఎన్నికల అనంతరం ఫాం హౌస్కు వెళ్లిపోయిన కేసీఆర్.. ఇప్పటికీ అక్కడి నుంచి బయటకు రావడంలేదు.

క్షేత్రస్థాయిలో కార్యకర్తలను దిశానిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన బాధ్యతలను పూర్తిగా కేటీఆర్, హరీశ్ రావుకు వదిలేశారు. దీనినే అస్త్రంగా మలుచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కేసీఆర్ ను దూరం చేయడంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను బీఆర్ఎస్ అభివర్ణిస్తే, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా జాతిపిత వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

దీనివల్ల కేసీఆర్ ను చులకన చేసే అస్త్రాలు బీఆర్ఎస్ స్వయంగా అందించిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నా, కేసీఆర్ మౌనంగా ఉండటం వల్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయని చెబుతున్నారు.

• కవిత వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా..
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్న బీఆర్ఎస్.. సొంత ఇంటిని చక్కబెట్టుకోవడంలో కూడా తడబడుతోందని అంటున్నారు. ప్రధానంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యాఖ్యలు సైతం పార్టీలో కలకలం రేపుతున్నాయి.

దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా కేసీఆర్ ఇంటి సమస్యను చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక తమ సంగతి ఏం చూస్తారన్న భావనకు వచ్చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలు కేసీఆర్ గైర్హాజరీ వల్ల బీజేపీ వైపు మొగ్గు చూపడం కూడా నష్టం చేకూర్చుతోందని పేర్కొంటున్నారు.

కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ను ఊహించుకునేందుకు ప్రజలు ఇంకా సిద్ధపడటం లేదని, కేటీఆర్ సైతం అందరి ఆమోదం పొందడంలో తడబడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు సేవలకు పరిమితులు విధించడం వల్ల కూడా బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందని అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో మార్పు వస్తే తప్ప.. ఎన్నికల్లో ఫలితాలు మారే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments