
Nikki Haley: భారత్ తో విభేదాలు అమెరికాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఐక్యరాజ్య సమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. భారత్ ను చైనా లాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలన్నారు. గత 25 సంవత్సరాలుగా భారత్ తో ఏర్పరచుకున్న సంబంధాలను అమెరికా ఆపివేస్తే వ్యూహాత్మక విపత్తు అవుతుందని హెచ్చరించారు. భారత్, చైనా మధ్య బలమైన భాగస్వామ్యం చాలా సులభమని నిక్కీ హేలీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని.. దాని పెరుగుదల స్వేచ్ఛా ప్రపంచానికి ఎలాంటి ఇబ్బంది కాదన్నారు. దీనికి విరుద్ధంగా చైనా కమ్యూనిస్ట్ పాలనలో నడుస్తున్నందున దాని పెరుగుతున్న శక్తి ఓ సవాల్ గా మారబోతోందన్నారు.
ఆసియాలో చైనాతో పోటీపడాలంటే భారత్ తో స్నేహం ఒక్కటే మార్గం అన్నారు నిక్కీ హేలీ. అమెరికా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. చైనా లాగానే పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. భారత్ దుస్తులు, చౌకైన ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయగలదని.. వీటిని అమెరికా స్వయంగా వెంటనే, పెద్ద ఎత్తున తయారు చేయలేదన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నారు. త్వరలో జపాన్ ను దాటిపోతుందని నిక్కీ హేలీ అన్నారు.
అటు చైనా ఎదుగుదలను భారత్ అడ్డుకోగలదన్నారు నిక్కీ హేలీ. 2020 గాల్వన్ లోయ వివాదంతో సహా భారత్, చైనా మధ్య అనేక వివాదాలు ఉన్నాయని నిక్కీ హేలీ గుర్తు చేశారు. అమెరికా భారతదేశం భాగస్వామి అయితే.. రెండు దేశాల ప్రయోజనాలు నెరవేరుతాయని.. చైనాకు వ్యతిరేకంగా మరింత బలంగా నిలబడగలదని సూచించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య వివాదం దీర్ఘకాలం కొనసాగితే.. అది పెద్ద పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిని చైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందని నిక్కీ అమెరికాను హెచ్చరించింది.