
ఆసుపత్రిలో కొత్త భవనాలు, వసతి గృహం ఏర్పాటుకు రూ. 52 కోట్లు మంజూరు
చార్మినార్ శాసనసభ్యుడితో కలసి ఆసుపత్రి , కళాశాలను సందర్శించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆనుదీప్ దురిశెట్టి
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ నిజామీయా తిబ్బి కళాశాల, జనరల్ ఆసుపత్రిని చార్మినార్ శాసన సభ్యులు మీర్ జుల్ఫిఖార్ అలీతో కలసి ఆయన కళాశాల, ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఆ దిశగా అన్ని విభాగాల వైద్యులు సేవా దృక్పదంతో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి, కళాశాల ఆవరణలో ఐదు పురాతన భవనాలను తొలగించే ప్రక్రియపై కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అత్యంత సౌకర్యాలతో అద్భుతమైన ఆసుపత్రి నిర్మాణం, అలాగే వైద్య విద్యార్థుల వసతి గృహం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.52 కోట్లు మంజూరు చేసిందన్నారు. హెరిటేజ్ పురాతన భవనాల రెనోవేషన్ చేపట్టెందుకు రూ.10 కోట్లు, అలాగే నూతన ఆసుపత్రి భవనం, హాస్టల్ నిర్మాణం, క్యాంటీన్ సదుపాయాలు కల్పించేందుకు రూ.42 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
పాత భవనాల తొలగింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగాలని, భవనాల తొలగింపు తదుపరి భూ విస్తీర్ణం యొక్క వివరాలను అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇక్కడి వసతి గృహం కూడా తొలగింపులో ఉన్నందున, వైద్య విద్యార్థులకు చార్మినార్ పరిసర ప్రాంతంలో తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బియుఎంఎస్ వైద్య విద్యార్థులకు ఫలక్ నుమా ప్రాంతంలో రెండు ఎకరాల్లో వసతి గృహహం ఏర్పాటుకు నివేదికలు అందచేయాలనని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు ఓ.పి బ్లాక్ ను శాసన సభ్యులతో కలసి సందర్శించి ఓ.పి వివరాలను, రోగులకు అందుతున్న వైద్యం, వైద్యసేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు కళాశాలలో లైబ్రరిని సందర్శించి పురాతనమైన ఉర్దూ, ఫార్సీ భాషలో గల వైద్య పుస్తకాలను పరిశీలించి వైద్య విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను తెలుసుకున్నారు. అదేవిదంగా ఫిజియోథెరపీ విభాగాన్ని సందర్శించి డాక్టర్ సిద్ధిఖి అందించిన పలు పరికరాలను పరిశీలించి అభినందించారు. హెచ్.డి.సి కమిటీ నిధులతో ఫిజియోథెరపీ డాక్టర్ ను నియమిస్తామని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందుతుందని ఈ సందర్భంగా అన్నారు. గర్భినులకు వైద్య సదుపాయాలు నిరంతరం అందాలని, అలాగే సాధారణ ప్రసావాలు ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కృషి చేయాలని, కళాశాలలో వైద్య విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో వివిధ విభాగాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, ఆసుపత్రికి వచ్చే రోగుల దృష్ట్యా వైద్యుల్ని, సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ను ప్రిన్సిపాల్ అభ్యర్థించగా నివేదికను అందచేస్తే డి. ఎం. ఈ కి పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శైజాదీ సుల్తానా, ఆసుపత్రి సూపరింటెండెంట్ వసంతరావు, డాక్టర్ హైదర్ యమని, కార్పొరేటర్ షోయబ్ ఖాద్రి, తహసీల్దార్ చంద్ర శేఖర్, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.