Dowry Harassment Ends in Brutal Murder: హర్యానాలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన అరుణ్ శర్మ ఒక నర్సింగ్ హోమ్‌లో రేడియాలజిస్ట్ గా పని చేస్తుండగా, అదే ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న కాజల్ తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల అనుమతితో గత సంవత్సరం నవంబర్‌లో వీరి వివాహం జరిగింది.
పెళ్లి అయిన మొదటి రోజుల్లో వారి జీవితం సంతోషంగా సాగింది. కొంతకాలం తర్వాత అరుణ్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. అదనపు కట్నం కోసం కాజల్‌ను వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. మార్చి 4న కాజల్ ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ వచ్చిన ఈ జంట మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
మద్యం మత్తులో భార్యపై దాడి
మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్ తన భార్యపై దాడి చేశాడు. మరుసటి రోజు ఇంటి మెట్ల దగ్గర ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటికే కాజల్ అపస్మారక స్థితిలో నేలపై పడిపోయింది. ఆమె ముక్కు నుంచి రక్తం కారడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
విషం ఇంజెక్షన్ ఇచ్చి ఘోరంగా..
ఈ ఘటనపై కాజల్ తల్లిదండ్రులు తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఇంట్లో టాయిలెట్ లో సిరంజి కనిపించిందని, అరుణ్ విషం ఇంజెక్షన్ ఇచ్చి తమ కుమార్తెను హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అరుణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. విషం ఇంజెక్షన్ ఇచ్చి భార్యను చంపినట్లు చెప్పడంతో అనుమానాలు నిజం అయ్యాయి. పోలీసులు అతడిని జైలుకు పంపించారు.
