కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న బీమ్ యాప్లో వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే తప్పనిసరిగా 4 లేదా 6 అంకెల పిన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉండేది. వివిధ బ్యాంకులు తమ విధానాల ప్రకారం 4 అంకెల లేదా 6 అంకెల పిన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పిన్ నమోదు చేసిన తరువాతే నగదు బదిలీ పూర్తవుతుంది. అయితే ఇప్పుడు బీమ్ యాప్లో కొత్తగా ప్రవేశపెట్టిన సదుపాయం ద్వారా పిన్ అవసరం లేకుండా కూడా చెల్లింపులు చేయగలిగే విధానం అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త విధానంలో బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించారు. వినియోగదారులు తమ ఫోన్లో ఉన్న వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు సాయంతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ సౌకర్యం ప్రధానంగా చిన్న మొత్తాల లావాదేవీల కోసం అందుబాటులో ఉంటుంది. రూ.5,000 లోపు జరిగే చెల్లింపులకు మాత్రమే ఈ విధానం అమలులో ఉంటుంది. ఆ మొత్తాన్ని మించిన లావాదేవీలకు మాత్రం యూపీఐ పిన్ నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో కూడా పనిచేసేలా రూపొందించారు. వినియోగదారుల బయోమెట్రిక్ వివరాలు ఫోన్లోనే ఎన్క్రిప్షన్ రూపంలో భద్రంగా నిల్వ ఉంటాయి కాబట్టి భద్రత విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంస్థ పేర్కొంది. దీంతో దుకాణాలు, చిన్న చెల్లింపుల సమయంలో వేగంగా, సులభంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే ముందుగా బీమ్ యాప్ను తెరిచి ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ బ్యాంక్ ఖాతాను ఎంచుకుని బయోమెట్రిక్ లావాదేవీల ఆప్షన్ను ప్రారంభించాలి. అనంతరం వేలిముద్ర లేదా ముఖ గుర్తింపును ధృవీకరించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వినియోగదారులు పిన్ నమోదు చేయకుండా చిన్న మొత్తాల చెల్లింపులను సులభంగా నిర్వహించగలుగుతారు.
ALSO READ: మీ బోటన వేలుపై ఈ గుర్తు ఉంటే లక్కే లక్కే!
