
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించిన కానిస్టేబుల్ రాజునాయక్‌కు కేంద్ర ప్రభుత్వం శౌర్య పథకాన్ని ప్రకటించింది. మనోధైర్యానికి, దేశం పట్ల అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఈ పోలీస్ అధికారి చూపిన విధేయతకు దేశం తలవంచి గౌరవం తెలిపింది. 2023లో నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఇద్దరు దంపతులను హత్య చేసిన నిందితుడు కరణ్ పరారీలో ఉండగా, ఆయనను పట్టుకోవడంలో రాజునాయక్ కీలక పాత్ర పోషించారు. ఆ నిందితుడిని పట్టుకునే క్రమంలో రాజునాయక్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. కరణ్‌ను గాలించి పట్టుకునే సమయంలో అతను చాతీ, తలపై కత్తితో దాడి చేశాడు. తీవ్రమైన గాయాల నుంచి రక్తస్రావం కొనసాగుతున్నా రాజు అతన్ని వదలకుండా పట్టుకున్నాడు. చివరికి సహచర పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం మూడు సర్జరీలకు లోనయ్యాక చికిత్సకు స్పందించి కోలుకున్న రాజునాయక్, ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ ఘటనలో రాజు ప్రదర్శించిన తెగువ, మనోబలాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అతనికి శౌర్య పథకాన్ని ప్రకటించింది. ఇది పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
విధి నిర్వహణ పట్ల నిబద్ధత, బాధ్యతతో పాటు ప్రాణాలకే ముప్పుగా ఉన్నా వెనకడుగు వేయని ధైర్యమే ఈ గౌరవానికి కారణమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజునాయక్ లాంటి అధికారులే ప్రజలలో పోలీస్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా చేస్తారని, ఇది యువతకు దేశసేవ పట్ల నూతన ప్రేరణనిస్తుందని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.