
NASA-ISRO NISAR: ఇస్రో కీలక ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. రేపు నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతుండగా, డిసెంబర్ లో గగయాన్ మిషన్ లో భాగంగా ‘హ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈమేరకు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
ఈ నెల 30న ‘నిసార్’ ప్రయోగం
నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా ‘నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్’ (నిసార్) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి మంగళవారం మధ్నాహ్నం 2:10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించి.. 27:30 గంటలపాటు కొనసాగించనున్నారు. ఆ తర్వాత షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం కావడంతో అమెరికా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు.
‘నిసార్’తో కలిగే లాభం ఏంటంటే?
నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుందన్నారు. నిసార్ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్‌ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలూ స్పష్టమైన ఫొటోలు తీసి భూమికి పంపిస్తుందని నారాయణన్ వివరించారు.
డిసెంబర్ లో గగన్ యాన్ కీలక ప్రయోగం
ఇక ఈ ఏడాది ‘గగన్ యాన్’లో భాగంగా ‘వ్యోమమిత్ర’ అనే కీలక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపుతామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. “డిసెంబరులో రోబోను నింగిలోకి పంపుతాం. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే ఏడాది మరో రెండు మానవ రహిత ప్రయోగాలు చేస్తాం. 2027లో వ్యోమగాములతో కూడిన గగన్‌యాన్ మిషన్ చేపడుతాం” అని నారాయణ్ వెల్లడించారు.
Read Also: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు, యెమెన్ సర్కారు కీలక నిర్ణయం!