
నారాయణపూర్/హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై వివాదాలు ముదురుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా, వీరిలో 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు అధికారులు శుక్రవారం ప్రకటించారు. మృతుల్లో పలువురు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) 7వ బెటాలియన్‌కు చెందినవారిగా గుర్తించారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ కూడా హతమయ్యారు. ఆయన మృతితో పాటు మరో పలువురు కీలక నేతలు కూడా మట్టుబడ్డారని సమాచారం. మొత్తం మృతులపై రూ.3.33 కోట్ల రివార్డ్లు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక పౌరహక్కుల సంఘాలు, వామపక్షాలు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నంబాల కేశవరావును ఒడిశాలోని ఓ ఆసుపత్రి నుంచి అదుపులోకి తీసుకుని, తీరా నారాయణపూర్‌లో హత్య చేసిన ఫేక్ ఎన్‌కౌంటర్ ఇదని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, నంబాల కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పోస్టుమార్టం పూర్తైనప్పటికీ, భద్రతా కారణాలు చూzపుతూ మృతదేహం అప్పగించేందుకు పోలీసులు సమయం తీసుకుంటున్నారు.
పౌర సంఘాలు, హక్కుల సంస్థలు ఇప్పటికే ఆందోళనలు ప్రారంభించగా, వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు సమస్యకు శాంతియుత పరిష్కార మార్గాలే ముందుగా చూడాలని, “ఆపరేషన్ కగార్”ను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయ, మానవ హక్కుల చర్చ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.