
Telanagana Reservoirs: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు నెమ్మదిగా నిండుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.18 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో రెండు వైపులా జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 69 వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద పంపింగ్ చేస్తూ నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 193 టీఎంసీల నిల్వ ఉంది.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 7 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 238.24 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 561 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
కేవలం 8 లక్షల ఎకరాల్లో వరినాట్లు
ఇక ఈ ఏడాది మే చివరి వారంలోనే రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో తొలకరి వర్షాలకే విత్తనాలు నాటారు. వరి నారు పోశారు. అయితే, ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో రైతులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రాంలో సాగు విస్తీర్ణం సుమారు 65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పుడు కేవలం 8 లక్షల ఎకరాల్లోనే రైతులు వరి నాట్లు వేశారు. పత్తి సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు కాగా, కేవలం 39 ఎకరాల్లోనే విత్తనాలు నాటారు. వర్షాల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిసి కుంటలు. చెరువులు నిండితే పంటలు వేసుకోవాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటికీ చాలా జిల్లాల్లో వర్షాలు పడక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
Read Also: మరో నాలుగు రోజులు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు!